
మణుగూరు, ఆగస్టు 27 (వై7 న్యూస్): అశ్వాపురం మండలంలోని రైతాంగానికి సాగునీటి సౌకర్యాలను మరింత విస్తరించేందుకు కీలకంగా భావిస్తున్న మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు హాజరుకానున్న నేపథ్యంలో, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు.
మణుగూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 29న అశ్వాపురం మండలంలో సీతారామ ప్రాజెక్ట్ పరిధిలోని మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం ద్వారా తుమ్మల చెరువుకు నీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ, గృహ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ మరియు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) హాజరుకానున్నారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు.
మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం ద్వారా అశ్వాపురం మండలంలోని వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని, రైతులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని సమావేశంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైతులు, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కురం రవి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పొలామూరి రాజు, జిల్లా కార్యదర్శి దొబ్బల వెంకటప్పయ్య, సింగారం సర్పంచ్ కలబోయిన మాధవరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు బోనగిరి శివ సైదులు, బానోత్ లక్ష్మణ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కూరపాటి సౌజన్య, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బర్ల శ్వేతన్, సీనియర్ నాయకులు కూచుపూడి బాబు, గుండ్ల వెంకటేశ్వర్లు, సిరపు గణేష్ రెడ్డి, బొజ్జ త్రిమూర్తులు, ఎండీ యాకుబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.








