ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కాల్స్, బ్యాంకింగ్, సోషల్ మీడియా, ఆన్‌లైన్ పేమెంట్స్ ఇలా ఎన్నో పనులకు ఫోన్‌పైనే ఆధారపడుతున్నాం. అలాంటి ఫోన్ పొరపాటున పోయినా లేదా దొంగతనానికి గురైనా చాలామంది కంగారుపడుతుంటారు. అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంచార్ సాథీ పోర్టల్ ద్వారా ఫోన్‌ను బ్లాక్ చేయడంతో పాటు దాని IMEI నంబర్ ఆధారంగా ట్రాక్ చేసేందుకు ప్రయత్నించవచ్చు.
ఫోన్ పోయిన వెంటనే ceir.sancharsaathi.gov.in పోర్టల్‌లోకి వెళ్లి CEIR సేవను ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం మీ ఫోన్ IMEI నంబర్, మొబైల్ నంబర్, అవసరమైన గుర్తింపు వివరాలు అందించాలి. వివరాలు సమర్పించిన తర్వాత ఫోన్‌ను నెట్‌వర్క్‌లలో ఉపయోగించకుండా బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫోన్ తిరిగి లభిస్తే.. అదే పోర్టల్ ద్వారా బ్లాక్‌ను తొలగించే సదుపాయం కూడా ఉంటుంది.
అంతేకాకుండా సంచార్ సాథీ ద్వారా మీ పేరుపై ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. మీకు తెలియకుండా మీ పేరుతో ఏదైనా సిమ్ కార్డు తీసుకున్నారా అనే విషయాన్ని చెక్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఫోన్ పోయినప్పుడు ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు.. సంచార్ సాథీ పోర్టల్‌లో CEIR సేవను ఉపయోగించడం ద్వారా మీ ఫోన్, వ్యక్తిగత డేటాను రక్షించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవచ్చు.








