పలాస, ఆగస్టు 28 (వై7 న్యూస్): పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం చైర్మన్ పదవికి జరుగుతున్న రాజకీయ చర్చల్లో టీడీపీ నాయకుడు దువ్వాడ శ్రీకాంత్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గత రెండు దశాబ్దాలుగా స్థానిక రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తూ, ఓటమి ఎరుగని నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
స్థానికంగా ప్రభావవంతమైన కళింగ సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ శ్రీకాంత్, అన్ని వర్గాల ప్రజలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, వ్యాపార వర్గాల మద్దతును కూడగట్టగల నాయకుడిగా పేరుపొందారు. రాజకీయ ప్రస్థానంలో కణితి విశ్వనాథం, అప్పయ్య దొర, గౌతు శ్యామసుందర శివాజీ వంటి సీనియర్ నాయకుల వద్ద శిష్యరికం చేసి అనుభవాన్ని సంపాదించారు.
గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన శ్రీకాంత్, తగిన ప్రాధాన్యం లభించకపోవడంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పలాస నియోజకవర్గంలో ఎమ్మెల్యే గౌతు శిరీష విజయానికి ఆయన కీలకంగా పనిచేశారని పార్టీ నాయకులు చెబుతున్నారు.
మున్సిపల్ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరిగితే శ్రీకాంత్‌కు మరింత అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్థానికంగా నిర్వహించిన కొన్ని సర్వేలు, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చల ప్రకారం టీడీపీ 20 నుంచి 25 వార్డుల్లో గెలిచే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
పార్టీ సీనియర్ నేతలు గౌతు శిరీష, గౌతు శివాజీ, వెంకన్న చౌదరి తదితరుల ఆశీస్సులతో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిత్వం దువ్వాడ శ్రీకాంత్‌కే దక్కే అవకాశాలు ఉన్నాయని పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.








