చింతూరు, జూలై 18 (వై7 న్యూస్): బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని, వాటిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని చింతూరు సీఐ గోపాలకృష్ణ అన్నారు.
పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం చింతూరు జూనియర్ కళాశాలలో అంగన్‌వాడీ కార్యకర్తలకు బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ గోపాలకృష్ణ మాట్లాడుతూ, మహిళలకు 18 సంవత్సరాలు, పురుషులకు 21 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే వివాహాలు జరగాలని తెలిపారు. చట్టవిరుద్ధంగా బాల్య వివాహాలు నిర్వహిస్తున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
మహిళా పోలీస్ స్టేషన్ సీఐ కన్నపరాజు మాట్లాడుతూ, బాల్య దశలోనే బాలికలకు వివాహాలు చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు, వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందని వివరించారు. బాలికల విద్యాభ్యాసానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఎస్సై లతాశ్రీ మాట్లాడుతూ, బాల్య వివాహాల నిర్మూలన సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. చట్టాలను గౌరవిస్తూ, నిబంధనలకు అనుగుణంగానే వివాహాలు జరపాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై సంతోష్ కుమార్, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి జయలక్ష్మి, మండలంలోని అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.









