E-PAPER

గర్భసంచిలో రెండున్నర కేజీల గడ్డ.. భద్రాచలం ప్రభుత్వ వైద్యుల విజయవంతమైన శస్త్రచికిత్స

గర్భసంచిలో రెండున్నర కేజీల గడ్డ తొలగింపు

భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్యుల అరుదైన విజయం

భద్రాచలం, జూలై 18 (వై7 న్యూస్): భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్యులు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఓ మహిళ ప్రాణాలను కాపాడారు. పట్టణానికి చెందిన ఆదివాసీ గిరిజన సంఘం నాయకుడు కుంజా శ్రీనివాస్ సతీమణి కుంజ విజయ తీవ్ర కడుపునొప్పితో ఆసుపత్రిని ఆశ్రయించగా, పరీక్షల అనంతరం ఆమె గర్భసంచిలో సుమారు రెండున్నర కిలోల బరువున్న గడ్డ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

సీనియర్ సర్జన్ డాక్టర్ ముదిగొండ రామకృష్ణ ఆధ్వర్యంలో సుమారు రెండున్నర గంటల పాటు కొనసాగిన శస్త్రచికిత్సను వైద్య బృందం విజయవంతంగా పూర్తి చేసి గడ్డను తొలగించారు. ప్రస్తుతం కుంజ విజయ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చయ్యే ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్‌ను ప్రభుత్వ ఆసుపత్రిలో విజయవంతంగా నిర్వహించడం ప్రభుత్వ వైద్య సేవల సామర్థ్యానికి నిదర్శనమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

కుంజ విజయను పరామర్శించిన సీపీఐ(ఎం) నాయకులు

శస్త్రచికిత్స అనంతరం కుంజ విజయను సీపీఐ(ఎం) నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.బి. నర్సారెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ ముదిగొండ రామకృష్ణ సేవలు భద్రాచలం ప్రాంత ప్రజలకు ఎంతో విలువైనవని కొనియాడారు. సుదీర్ఘకాలంగా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలందిస్తూ ఎన్నో క్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించి ముఖ్యంగా ఆదివాసీ, గిరిజన ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించారని పేర్కొన్నారు.

డాక్టర్ రామకృష్ణ బదిలీతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీరని లోటు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంగా ఉన్న భద్రాచలం ఆసుపత్రికి శాశ్వత సర్జన్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. డాక్టర్ రామకృష్ణ సేవలను మరికొంతకాలం భద్రాచలంలో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యుడు బండారు శరత్ బాబు, ఇర్ఫా అనసూయ, పారెల్లి సంతోష్ కుమార్, డి. సీతాలక్ష్మి, కొలగాని రమేష్, నాదెండ్ల లీలావతి, కనక శ్రీ, కుంజా శ్రీను, సోయం జోగారావు, ఎస్ఎఫ్‌ఐ నాయకుడు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News