పలాస/కాశీబుగ్గ, జూలై 18 (వై7 న్యూస్): కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ సీఐ రామకృష్ణను వీఆర్ (వేకెన్సీ రిజర్వ్)కు పంపిస్తూ శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నెల 10వ తేదీన కాశీబుగ్గలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నడిపిన ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరించడంలో, కేసు దర్యాప్తు నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు సీఐ రామకృష్ణపై రావడంతో ఆయనను వీఆర్‌కు పంపినట్లు సమాచారం.
ఇదే కేసులో విధుల పట్ల అలసత్వం ప్రదర్శించారనే కారణంతో ఇప్పటికే కాశీబుగ్గ ఎస్ఐ సునీల్‌ను కూడా వీఆర్‌కు పంపిన విషయం తెలిసిందే.
ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, కేసు దర్యాప్తును ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిసింది.









