పలాస, జూలై 18 (వై7 న్యూస్): అఖిల భారత కిసాన్ మజ్దూర్ సభ (AIKMS) జిల్లా 11వ మహాసభల కరపత్రాలను శనివారం పలాస మండలం బొడ్డపాడులోని అమరవీరుల స్మారక మందిరం వద్ద ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వంకల మాధవరావు మాట్లాడుతూ, జిల్లా 11వ మహాసభలు ఈ నెల 25వ తేదీన శ్రీకాకుళంలోని కళింగ భవన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
మహాసభల్లో రైతులకు గిట్టుబాటు ధరలు, వ్యవసాయ రుణమాఫీ, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి, వంశధార-నాగావళి నదుల అనుసంధానం వంటి కీలక సమస్యలపై విస్తృతంగా చర్చించనున్నట్లు నాయకులు తెలిపారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తు పోరాట కార్యాచరణను కూడా ఈ సమావేశంలో రూపొందించనున్నట్లు వెల్లడించారు.
రైతు, వ్యవసాయ కార్మిక వర్గాల హక్కుల సాధనకు ఈ మహాసభలు దోహదపడతాయని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.









