దేవీపట్నం తహశీల్దార్, ఎంపీడీఓలకు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఫిర్యాదు
దేవీపట్నం, జూలై 18 (వై7 న్యూస్): ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరుల అక్రమ ఆక్రమణలు, వ్యాపార కార్యకలాపాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ (ASP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం దేవీపట్నం తహశీల్దార్, ఎంపీడీఓలకు లీగల్ రిప్రజెంటేషన్‌తో పాటు ఆర్టీఐ దరఖాస్తులను సమర్పించారు.
ఈ సందర్భంగా కుంజా శ్రీను మాట్లాడుతూ, ఐదో షెడ్యూల్డ్ ఏరియా చట్టాలు, ఎల్‌టీఆర్ 1/70 నిబంధనలను ఉల్లంఘిస్తూ దేవీపట్నం మండలంలోని ప్రధాన రహదారుల వెంట గిరిజనేతరులు అక్రమంగా హోటళ్లు, రిసార్టులు, వ్యాపార సముదాయాలు, ఇతర శాశ్వత కట్టడాలు నిర్మించారని ఆరోపించారు. ఏజెన్సీ ట్రాక్ట్స్ చట్టం-1917, ఎల్‌టీఆర్ 1/59, 1/70 చట్టాల ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనేతరుల భూస్వామ్యం, నిర్మాణాలు చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.
దేవీపట్నం మండల కేంద్రంలోని ఇందుకూరు, ఇందుకూరుపేట, శరభవరం, పాజులబాద్ (పెద్ద భీమ్‌పల్లి) గ్రామాల్లో ప్రధాన రహదారి మార్జిన్లు, గ్రామ కంఠాలు, ప్రభుత్వ భూములను అధిక శాతం గిరిజనేతరులు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి నిర్మాణాలకు స్థానిక సంస్థలు ఏ ప్రాతిపదికన అనుమతులు ఇచ్చాయో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
అక్రమ ఆక్రమణలపై రెవెన్యూ, పంచాయతీ శాఖలు సంయుక్తంగా సర్వే నిర్వహించి, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు. 15 రోజుల్లోగా అధికారులు చర్యలు తీసుకోకపోతే ఆదివాసీలను ఏకం చేసి ఏజెన్సీ వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని, అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ డివిజన్ ప్రధాన కార్యదర్శి చోడి ప్రదీప్ కుమార్ దొర, డివిజన్ కోఆర్డినేటర్ పీఠప్రసాద్, యాలగడ్డ నాగేశ్వరరావు, కుంజం పండు దొర, గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.









