మణుగూరు, జూలై 18 (Y7 న్యూస్ తెలుగు):
పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు దాడులకు పాల్పడుతున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. గిరిజనులపై అధికారుల చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
మణుగూరు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండల అధ్యక్షుడు, సొసైటీ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు కుంట లక్ష్మణ్ మాట్లాడారు.
అశ్వాపురం మండలం మనుబోతులగూడెం గ్రామంలో పోడు పట్టాదారులపై ఫారెస్ట్ అధికారులు దురుసుగా వ్యవహరించారని ఆరోపించారు. మహిళలు అని చూడకుండా ఇబ్బందులకు గురిచేశారని, సాగులో ఉన్న పత్తి పంటను ధ్వంసం చేసి దున్నేశారని పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కృషి ద్వారా గిరిజనులకు పోడు పట్టాలు అందించారని తెలిపారు.
ప్రస్తుతం కొంతమంది గిరిజనులు అదనంగా భూములు సాగు చేస్తున్నారనే కారణంతో వారిపై కఠిన చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. గిరిజనులతో అధికారులు సామరస్యంగా చర్చించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
గిరిజనులపై ఇలాంటి ఘటనలు పునరావృతమైతే బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. గిరిజనులకు భూమిపై ఉన్న హక్కులను గౌరవించాలని కోరారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి పోడు భూముల వివాదాలను పరిష్కరించి, అర్హులైన గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో నూకారపు రమేష్, అక్కి నరసింహారావు, ముద్దంగుల కృష్ణ, ఎస్కే మౌలానా, జావిద్ భాష, తురక రామకోటి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.









