శ్రీకాకుళం జిల్లా పలాస | వై 7 న్యూస్ | జూలై 18
పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని ఏపీటీపీసీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వజ్జ బాబూరావు అన్నారు. పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కాశీబుగ్గ మూడు రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారంగా ఏర్పడి స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో వజ్జ బాబూరావు స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు.
మాట్లాడుతూ వజ్జ బాబూరావు.. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యతగా భావించి పరిశుభ్రతను కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛత ప్రారంభమైతేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.
ప్రజలు తమ ఇళ్లు, వీధులు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో చేపడుతున్న కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సిబ్బంది, జీడీ వ్యాపారుల సంఘం ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
“పరిశుభ్రమైన పలాస – అభివృద్ధి చెందిన పలాస, పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ – స్వర్ణాంధ్రప్రదేశ్” లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వజ్జ బాబూరావు పిలుపునిచ్చారు.









