పలాస, జూన్ 20 (వై7 న్యూస్): శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ పరిధిలో శనివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. కటక్–గుణుపూర్ ప్యాసింజర్ రైలులో ప్రయాణిస్తున్న ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన కలకలం రేపింది.
రైల్వే సిబ్బంది గుర్తించి సమాచారం అందించడంతో పలాస ప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్పీ) అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, మృతుడు సుమారు 45 నుంచి 50 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తిగా గుర్తించారు. అతను ఎరుపు రంగు టీ-షర్టు, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు తెలిపారు.
మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించకపోవడంతో అతని పూర్తి వివరాలు తెలియరాలేదు. రైలులో ప్రయాణిస్తున్న సమయంలో అస్వస్థతకు గురై మృతిచెంది ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే మృతికి గల ఖచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం మాత్రమే వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పలాస జీఆర్పీ పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతుడిని గుర్తించగల బంధువులు లేదా ఇతరులు ఎవరైనా ఉంటే వెంటనే పలాస జీఆర్పీ రైల్వే పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని అధికారులు కోరారు. ఈ మేరకు సమీప జిల్లాలు, ఇతర రాష్ట్రాల పోలీస్ స్టేషన్లకు కూడా సమాచారం పంపినట్లు తెలిపారు.
ఇటీవల కనిపించకుండా పోయిన వ్యక్తుల వివరాలు తెలిసిన వారు లేదా మృతుడిని గుర్తించగల వారు 94922 50069 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని జీఆర్పీ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతో మృతుడి కుటుంబ సభ్యులను గుర్తించి సమాచారం అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.









