E-PAPER

బూత్ స్థాయిలో కాంగ్రెస్ విజయానికి బీఎల్‌ఏలే కీలకం: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మణుగూరు, జూన్ 13 (వై7 న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం అంబేద్కర్ సెంటర్‌లోని డీవీ ఫంక్షన్ హాల్‌లో పినపాక నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) శిక్షణా శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ షబ్బీర్ అలీ, డీసీసీ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ముఖ్య అతిథులుగా హాజరై బీఎల్‌ఏలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ విజయానికి బూత్ స్థాయి కార్యకర్తల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న పోరాటం బూత్ స్థాయిలో బలోపేతం అయినప్పుడే ఫలితాలు ఇస్తుందని అన్నారు. ప్రతి బీఎల్‌ఏ ఒక సైనికుడిలా పనిచేసి పార్టీని ప్రజల్లో మరింత బలంగా నిలపాలని పిలుపునిచ్చారు.

డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న మాట్లాడుతూ, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు, చిరునామా మార్పులు వంటి అంశాలను వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. బూత్ స్థాయిలో 100 శాతం పోలింగ్ లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, బీఎల్‌ఏలు కేవలం ఓటరు జాబితా పనులకే పరిమితం కాకుండా పార్టీకి, ప్రజలకు మధ్య వారధిలా వ్యవహరించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేయాలని సూచించారు.

రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా ప్రజలు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. ప్రతి బూత్‌లో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని, యువత ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ప్రతి ఓటు విలువైనదని, అర్హులైన ఓటర్లందరూ జాబితాలో ఉండేలా బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. రాబోయే ఎన్నికల్లో పినపాక నియోజకవర్గంలోని ప్రతి బూత్‌లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ సాధించే దిశగా ఇప్పటి నుంచే కార్యాచరణ చేపట్టాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చీకటి కార్తీక్, మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, బీఎల్‌ఏలు, బీఎల్‌ఓలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!