E-PAPER

సత్తుపల్లి సైబర్ మోసం కేసులో మరో నిందితుడు అరెస్ట్

సత్తుపల్లి, జూన్ 5: సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదు అయిన భారీ సైబర్ నేర కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మంకు చెందిన నల్లనాగుల శ్వేతన్ను గురువారం ఏసీపీ వసుంధర యాదవ్ పర్యవేక్షణలో సత్తుపల్లి ఇన్‌స్పెక్టర్ శ్రీహరి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.పోలీసుల వివరాల ప్రకారం, శ్వేతన్ 2023లో కేథలిక్ సిరియన్ బ్యాంక్ (CSB) చంద్రుగొండ శాఖలో “శ్వేతన్ ఎంటర్‌ప్రైజెస్” పేరుతో కరెంట్ అకౌంట్‌ను ప్రారంభించాడు. ఈ అకౌంట్‌ను సైబర్ మోసాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల కోసం ఉపయోగించినట్లు విచారణలో తేలింది.ఈ కేసులో ఇప్పటికే 2026 ఫిబ్రవరి 23న అరెస్టైన అడపా రామవెంకట చరణ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు. అతని వాంగ్మూలం ప్రకారం, ఉడతనేని వికాస్ చౌదరి మరియు బొప్పన నాగప్రియ హైదరాబాద్‌లో ఓ కంపెనీ ఏర్పాటు చేసి, విదేశాల్లోని కొంతమంది వ్యక్తులతో సంబంధాలు కొనసాగిస్తూ కాల్ సెంటర్లను నిర్వహించేవారు.ఈ కాల్ సెంటర్ల ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలకు ఫోన్లు చేసి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, క్రిప్టో ట్రేడింగ్, గేమింగ్, బెట్టింగ్, ఓటీపీ మోసాలు, రూపే ట్రాన్సాక్షన్లు, మ్యాట్రిమోనీ సేవల పేరుతో అధిక లాభాల ఆశ చూపించి మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితులను టెలిగ్రామ్ గ్రూపుల్లో చేర్చి, వివిధ లింకులు, క్యూఆర్ కోడ్‌లు పంపించి వారి బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులను కాజేసేవారని తెలిపారు.

ఈ మోసాల కోసం అనేక బ్యాంకు కరెంట్ అకౌంట్లు అవసరమవడంతో, పలువురి పేర్లపై “మ్యూల్ అకౌంట్లు” సేకరించి వాటి ద్వారా అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు దర్యాప్తులో బయటపడింది.

ఈ సైబర్ నేర కేసులో మొత్తం 28 మంది నిందితులు ఉండగా, ఇప్పటివరకు 27 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని వెల్లడించారు.

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!