E-PAPER

గిరిదవర్ సాబ్ ఏమిటి సంగతి…?

పట్టుకున్న జేసీబీలు, ట్రాక్టర్లు ఏమయ్యాయి..?

అధికార ప్రోత్సాహం ముందు అధికారులు తలవంచారా..?

యువకుడిపై మట్టి మాఫియా ప్రతాపమా..?

ఫిర్యాదు చేసిన యువకుడికి న్యాయం జరుగుతుందా..?

జిల్లా అధికారుల వరకు వెళ్లేందుకు గ్రామస్తుల సిద్ధత

కొత్తగూడెం, మే 28, వై7 న్యూస్:

దమ్మపేట మండలంలో అక్రమ మట్టి తరలింపు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గ్రామస్థుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఓ నాయకుడు ఆగ్రహంతో వ్యవహరించిన ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది.

స్థానికుల ఆరోపణల ప్రకారం, గత ప్రభుత్వ హయాంలో రైతుల కోసం నిర్మించిన సీతారామ ప్రాజెక్ట్ ఇందిరసాగర్ కాలువకు ఇరువైపుల నిల్వ ఉంచిన మట్టిని, అశ్వారావుపేట ఎమ్మెల్యే పేరు చెప్పుకుంటూ ఓ స్థానిక నాయకుడు జేసీబీలు, ట్రాక్టర్ల సహాయంతో అక్రమంగా తరలించి విక్రయిస్తున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

ఈ విషయమై గ్రామస్తులు రెవెన్యూ మరియు పోలీస్ అధికారులకు సమాచారం అందించగా, అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత కూడా మట్టి తరలింపును పూర్తిగా అడ్డుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

గ్రామస్థులు ప్రశ్నలు అడిగిన సమయంలో సంబంధిత నాయకుడు సమాధానాలు చెప్పలేక ఓ యువకుడిపై దురుసుగా ప్రవర్తించి, దాడికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని కూడా తోసిపుచ్చినట్లు సమాచారం. దాడికి గురైన యువకుడు గ్రామస్థుల సహాయంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.

ఇందిరసాగర్ కాలువ వద్ద పట్టుబడిన జేసీబీలు, ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు మరియు పోలీసుల సహాయంతో తరలించినప్పటికీ, అవి స్టేషన్‌లో గానీ, తహసీల్దార్ కార్యాలయంలో గానీ కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మధ్యలోనే ఎందుకు విడిచిపెట్టారనే ప్రశ్నలు గ్రామంలో చర్చనీయాంశంగా మారాయి.

అనుమతులు లేవని చెబుతూ వాహనాలను స్వాధీనం చేసుకున్న అధికారులు, తర్వాత వాటిని ఎందుకు వదిలేశారో స్పష్టత ఇవ్వాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. పాలకవర్గ సభ్యుల పేర్లు వినియోగిస్తూ అక్రమాలకు పాల్పడటం ఆందోళనకరమని పెద్ద గొల్లగూడెం గ్రామానికి చెందిన పలువురు అభిప్రాయపడుతున్నారు.

యువకుడిపై జరిగిన దాడికి తక్షణమే న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక అధికారుల సమక్షంలో సమస్యను పరిష్కరించకపోతే జిల్లా ఉన్నతాధికారులను ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!