ఖమ్మం నగరంలోని వైరా రోడ్డులో వివాహేతర సంబంధం అనుమానంతో ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్న సంఘటన తీవ్ర కలకలం రేపింది.
కామేపల్లి మండలం సాతానిగూడెం గ్రామానికి చెందిన భూక్యా ఆనంద్ ఖమ్మం బొమ్మన సెంటర్‌లో సెల్‌ఫోన్ షాపు నిర్వహిస్తున్నాడు. అదే షాపులో రియాజ్ అనే వ్యక్తి మెకానిక్‌గా పని చేస్తున్నాడు. రియాజ్ తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం ఆనంద్‌కు ఉన్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో నిన్న రాత్రి సుమారు 10:45 గంటలకు నిజాంపేట ప్రాంతంలోని రియాజ్ ఇంటికి వెళ్లిన ఆనంద్, అతనితో వాగ్వాదానికి దిగాడు. ఘర్షణ క్రమంగా హింసాత్మకంగా మారి, ఆనంద్ తన వద్ద ఉన్న కత్తితో రియాజ్‌పై దాడి చేయగా, రియాజ్ కూడా ఇంట్లో ఉన్న చాకుతో ఎదురుదాడి చేశాడు.
ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ నిజాంపేట నుంచి బిలీఫ్ హాస్పిటల్ మార్గం మీదుగా ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లినట్లు సమాచారం.
ప్రస్తుతం రియాజ్ ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆనంద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.








