E-PAPER

బాల్యవివాహాలను అంతం చేద్దాం – ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం

కొత్తగూడెం డెస్క్ ;
బాల్యవివాహాలకు వ్యతిరేకంగా గోడపత్రిక ఆవిష్కరణ
జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యా చందన, జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బాల్యవివాహాల నిర్మూలన దిశగా కీలక అడుగు పడింది. ఎయిడ్ సంస్థ ఆధ్వర్యంలో, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సంస్థ సహకారంతో రూపొందించిన గోడపత్రికను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యా చందన తన చాంబర్లో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బాల్యవివాహాలు ఒక సామాజిక దురాచారం అని పేర్కొన్నారు. ఇలాంటి దురాచారాన్ని సమాజం మొత్తం కలిసి నిర్మూలించాల్సిన అవసరం ఉందని తెలిపారు. బాలల భవిష్యత్తు సురక్షితంగా ఉండాలంటే చిన్న వయసులో వివాహాలను పూర్తిగా నిరోధించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను బాల్యవివాహాలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ నడుం బిగించాలని కోరారు.ఏప్రిల్ 19న జరగనున్న అక్షయ తృతీయ సందర్భంగా, బాల్యవివాహాలపై అవగాహన కల్పించేందుకు ఈ గోడపత్రికను ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గ్రామస్థాయిలో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, బాలల పరిరక్షణ విభాగం ద్వారా వివిధ సేవలు అందిస్తున్నామని వెల్లడించారు.
జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా మాట్లాడుతూ, చిన్న వయసులో వివాహం చేయడం వల్ల బాలికలు శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కొంటారని అన్నారు. సరైన పరిపక్వత లేకుండా పుట్టే పిల్లలు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడే.అవకాశముందని, కొన్ని సందర్భాల్లో మాతృ-శిశు మరణాలు కూడా సంభవిస్తున్నాయని తెలిపారు. ఈ ప్రభావం సమాజంలో స్త్రీ-పురుష నిష్పత్తిపై కూడా పడుతుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డి. సమ్మక్క (డీపీఎం), నర్మద (డీపీఎం), అనురాధ (ఏపీఎం), ఎయిడ్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ వి. రాజేష్, కమ్యూనిటీ సోషల్ మొబిలైజర్లు మోహన్, మాన్సింగ్, జ్యోతి, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!