భద్రాద్రి కొత్తగూడెం: జూలూరుపాడు మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి, అనంతరం కరివారిగూడెం గ్రామంలో తాగునీటి పరిస్థితిని పరిశీలించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రంలో మాయిశ్చర్ మిషన్, తూకం యంత్రాలు, గ్రేడింగ్ యంత్రాలు తదితర సదుపాయాలను పరిశీలించిన కలెక్టర్, కొనుగోలు ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం కొనుగోలు వివరాలు, ప్రస్తుత సీజన్ అంచనాలు, టార్పాలిన్లు, గన్నీ బ్యాగుల నిల్వలపై సమాచారం సేకరించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని సూచించారు. చెల్లింపులు ఆలస్యం కాకుండా తక్షణమే బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని, పారదర్శకత పాటించాలని ఆదేశించారు.
అనంతరం కరివారిగూడెం గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌ను పరిశీలించిన కలెక్టర్, తాగునీటి సరఫరాలో ఉన్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అవసరమైతే ప్రత్యామ్నాయంగా బోర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని సూచించారు. వేసవి కాలం మొత్తం తాగునీటి ఎద్దడి లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ, మిషన్ భగీరథ మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.








