భద్రాచలం:
భద్రాచలం పట్టణంలో ఆరేళ్లుగా ఇసుక రీచ్ లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బి. నర్సారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే భద్రాచలం కేంద్రంగా ఇసుక రీచ్‌ను ప్రారంభించి “మన ఇసుక – మన వాహనం” పథకం ద్వారా ప్రజలకు ఉచితంగా ఇసుక అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
మంగళవారం సిపిఐఎం భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల అడ్డా వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రంశెట్టి వెంకట రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నర్సారెడ్డి మాట్లాడుతూ, ఇసుక కొరత కారణంగా పేదలు ఇండ్లు నిర్మించుకోవడం భారంగా మారిందని అన్నారు.
ప్రభుత్వ పనులకు కూడా ఇసుక దొరకకపోవడం దురదృష్టకరమని, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం విచారకరమని విమర్శించారు. చర్ల, వెంకటాపురం ప్రాంతాల నుంచి వచ్చే ఇసుక లారీల వల్ల రహదారులు దెబ్బతింటున్నప్పటికీ, స్థానికులకు మాత్రం ఇసుక అందుబాటులో లేకపోవడం అన్యాయమని పేర్కొన్నారు.
ఇసుక రీచ్ రాకపోవడానికి గల కారణాలను ప్రజలకు వెల్లడించాలని, రాజకీయ జోక్యం వల్లే సమస్య ఏర్పడిందని ఆరోపించారు. ఇసుక కొరతతో చిన్న నిర్మాణాలు కూడా నిలిచిపోతున్నాయని, దీంతో కార్మికులు వలసలు వెళ్తున్నారని తెలిపారు.
గ్రామపంచాయతీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉచిత ఇసుక హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో సిపిఐఎం ఆధ్వర్యంలో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐఎం నాయకులు నకిరీకంటి నాగరాజు, చుక్క మాధవరావు, సిఐటియు నాయకులు అమలాపురం శ్రీను, ఏసు, డేగల రాజు, గజ్జల సత్తిరాజు తదితరులు పాల్గొన్నారు.









