వై 7 న్యూస్ | బూర్గంపాడు
మోడీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించిన సీపీఎం
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, “వీబీజీఆర్ జామ్” పేరుతో కొత్త బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిందని, ఆ విధానాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయని సీపీఎం పార్టీ బూర్గంపాడు మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ పేరుతోనే కొనసాగాలని, ఆ పేరును తొలగించి చట్టాన్ని రద్దు చేయాలనే కుట్రలను మోడీ ప్రభుత్వం పన్నుతోందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు ప్రతి ఒక్కరికీ అందడం లేదని, పని చేసినా సరైన వేతనాలు సమయానికి చెల్లించడం లేదని ప్రజలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని అన్నారు.
ఈ పరిస్థితుల్లో ఇప్పుడు పూర్తిగా ఉపాధి హామీ పనినే లేకుండా చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దెబ్బతీసే విధంగా చర్యలు చేపడుతోందని ఆయన విమర్శించారు. ఇది గ్రామీణ కార్మికుల జీవన హక్కులపై నేరుగా దాడి చేయడమేనని తెలిపారు.
అందువల్ల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికులందరూ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడిందని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
ఇదే సమయంలో ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు భరించాల్సి ఉండగా, ఆ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలపై దాడి చేస్తోందని విమర్శించారు. జాతీయ స్థాయిలో ప్రజల పోరాటాలతో సాధించుకున్న ఉపాధి హామీ పథకాన్ని ఈ విధంగా ఇబ్బందులకు గురి చేయడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని బత్తుల వెంకటేశ్వర్లు తెలిపారు.









