స్థానిక ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు – ఎమ్మెల్యేను ఆశ్రయించిన 40 మంది టోల్ సిబ్బంది
వై 7 న్యూస్ తెలుగు | పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురంలో ఉన్న టోల్ ప్లాజాలో యాజమాన్య ధోరణి మారడం లేదని, స్థానిక ఉద్యోగులపై అన్యాయమైన చర్యలు కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ టోల్ ప్లాజాలో పనిచేస్తున్న సుమారు 40 మంది ఉద్యోగులు ఆదివారం స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషను ఆశ్రయించారు.
టోల్ ప్లాజాలో నేటికీ వైకాపాకు చెందిన టోల్ ఉద్యోగి ఉప్పాడ ప్రసాద్ మాట ప్రకారం యాజమాన్యం వ్యవహరిస్తోందని ఉద్యోగులు ఆరోపించారు. ఆయన చెప్పినట్టు స్థానిక సిబ్బందిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ, వేధింపులు కొనసాగిస్తున్నారని వాపోయారు.
పలాస టోల్ ప్లాజాలో పనిచేస్తున్న ఉద్యోగులపై పెత్తనం చెలాయిస్తూ, కారణం లేకుండా హెచ్చరికలు, ఉద్యోగ భద్రత లేకుండా చేయడం జరుగుతోందని వారు తెలిపారు. ఈ తరహా చర్యల వల్ల కార్మికులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని పేర్కొన్నారు.
ఇదే టోల్ ప్లాజాలో గతంలో పనిచేసిన దివ్యాంగుడు దొంకణ ధర్మారావును ఉద్యోగం నుంచి తొలగించడంతో, ఆయన ఇచ్చాపురం రైల్వే స్టేషన్‌లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటనను ఉద్యోగులు గుర్తు చేశారు. ఆ ఘటనను దృష్టిలో పెట్టుకుని అయినా యాజమాన్యం తన వైఖరిని మార్చుకోవాల్సిందిగా వారు కోరారు.
ఈ అంశంపై తక్షణమే జోక్యం చేసుకుని, టోల్ ఉద్యోగులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే గౌతు శిరీషను వారు విజ్ఞప్తి చేశారు.
రిపోర్టర్ : దినేష్









