తాడ్వాయి:
తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క–సారాలమ్మ జాతరలో 2006 నుంచి ప్రతి రెండు ఏళ్లకోసారి ఆదివాసీ సంఘాలు నిర్వహిస్తున్న ఆదివాసీ తెగల సమ్మేళనం ఈసారి కూడా అదే ఆనవాయితీగా జరగనున్నది. రాబోయే 2026 జనవరిలో నిర్వహించబోయే సమ్మక్క–సారాలమ్మ మహాజాతరను పురస్కరించుకొని జనవరి 7వ తేదీన ములుగు జిల్లా ఆదివాసీ సంఘాల జాక్ ఆధ్వర్యంలో ఈ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడెం బాబు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆదివాసీ ప్రజలు, ఆదివాసీ సంఘాలు, వివిధ తెగలకు చెందిన ప్రతినిధులు ఈ సమ్మేళనంలో విస్తృతంగా పాల్గొనాలని ఆయన కోరారు.
ప్రభుత్వం మేడారంలో సమ్మక్క–సారాలమ్మ గుడి నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చర్యలు చేపడుతున్న సమయంలో, ములుగు జిల్లాలోని కొందరు అధికారులు ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. స్థానిక గుడి పూజారులు మరియు మంత్రి సీతక్క ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తూ, గుడి శిల్పకారులకు బాడ్జ్ నుండి కేటాయించాల్సిన నిధులను విడుదల చేయకుండా జాతర ఏర్పాట్లను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అభిప్రాయాన్ని కార్యక్రమంలో పలువురు ఆదివాసీ నాయకులు వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో ములుగు జిల్లా జాక్ చైర్మన్ దబ్బకట్ల సుమన్, ఆదివాసీ విద్యార్థి సంఘం (ASU) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోర్నిబెల్లి గణేష్, మహిళ జిల్లా చైర్మన్ చేలా శమంతకమణి తదితరులు పాల్గొన్నారు.









