E-PAPER

సింగరేణి చరిత్రలో కొత్త అధ్యాయం

జైపూర్, ఆగస్టు 6 (వై7 న్యూస్): సింగరేణి కాలరీస్ కంపెనీ చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు గని నుంచి లోడ్ చేసిన తొలి బొగ్గు రైల్వే రేకు సుమారు 1,131 కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేసి గురువారం మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ)కి చేరుకుంది. ఇతర రాష్ట్రంలోని సింగరేణి గని నుంచి తెలంగాణకు బొగ్గు సరఫరా కావడం సంస్థ చరిత్రలో ఇదే తొలిసారి.

ఈ సందర్భంగా విదేశీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు వీడియో సందేశం ద్వారా సింగరేణి యాజమాన్యం, అధికారులు, కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలే ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని, తెలంగాణ అభివృద్ధిలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.

బొగ్గు ఉత్పత్తితో పాటు విద్యుత్ ఉత్పత్తిలోనూ సింగరేణి రాష్ట్ర ప్రగతికి తోడ్పడుతోందని, ఇప్పుడు ఒడిశాలోని నైనీ గని నుంచి తెలంగాణకు బొగ్గు రవాణా ప్రారంభం కావడం చారిత్రాత్మక ఘట్టమని భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని, ఇటీవల తాడిచెర్ల-2, మణుగూరు డిప్‌సైడ్ బ్లాకులు సంస్థకు కేటాయించినట్లు తెలిపారు.

సింగరేణి తెలంగాణకే పరిమితం కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలు, విదేశాలకు కూడా విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన పేర్కొన్నారు. క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ రంగాల్లో అడుగుపెట్టి, ప్రపంచ స్థాయి మైనింగ్ సంస్థలతో పోటీ పడే స్థాయికి సింగరేణిని తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని చెప్పారు.

నైనీ సమీపంలోని హిందోల్ రైల్వే సైడింగ్‌లో లోడ్ చేసిన తొలి రైల్వే రేకులో 59 BOXN వేగన్ల ద్వారా సుమారు 4 వేల టన్నుల జి-10 గ్రేడ్ బొగ్గు తెలంగాణకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ బొగ్గును విద్యుత్ ఉత్పత్తి అవసరాల కోసం వినియోగించనున్నారు.

ఒడిశా నుంచి తెలంగాణకు తొలి బొగ్గు రవాణా విజయవంతం కావడంలో సహకరించిన తెలంగాణ ప్రభుత్వం, ఒడిశా ప్రభుత్వం, భారతీయ రైల్వేలు, సంబంధిత అధికారులకు సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఎస్టీపీపీకి చేరుకున్న తొలి నైనీ బొగ్గు రైల్వే రేకుకు సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి. సూర్యనారాయణ, డైరెక్టర్ (ఈ&ఎం) ఎం. తిరుమలరావు ఘన స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం కోల్ యార్డులో బొగ్గు అన్‌లోడింగ్ ప్రక్రియను ప్రారంభించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ విద్యుత్ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూ నైనీ గని నుంచి బొగ్గు సరఫరా ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఇతర రాష్ట్రాలకు బొగ్గు సరఫరా చేసిన సింగరేణి, ఇప్పుడు ఇతర రాష్ట్రంలోని తన గని నుంచి స్వరాష్ట్రానికి బొగ్గు తరలించడం అరుదైన ఘట్టమని పేర్కొన్నారు.

ఇక రాష్ట్ర విద్యుత్ అవసరాల తీర్చడంలో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కీలక పాత్ర పోషిస్తోందని, ప్రస్తుతం మరో 800 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ యూనిట్ నిర్మాణంలో ఉందని డైరెక్టర్ (ఈ&ఎం) ఎం. తిరుమలరావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ ఈడీ సిహెచ్ చిరంజీవి, జీఎం ఎం. నరసింహారావు, జీఎం (ఈ&ఎం) సూర్యనారాయణ రాజు, కార్మిక సంఘాల ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!