భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:
మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ 14 ఏళ్ల బాలుడు గడ్డి మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన దుమ్ముగూడెం మండలంలో చోటుచేసుకుంది.
దుమ్ముగూడెం మండలం సింగవరం గ్రామానికి చెందిన కుంజ విష్ణు (14) ఏడో తరగతి వరకు చదువుకున్నాడు. అనంతరం చదువును కొనసాగించకుండా ఖాళీగా ఉంటున్న నేపథ్యంలో తల్లిదండ్రులు అతడిని తన మేనమామ వద్దకు పంపించినట్లు సమాచారం.
గత పది రోజులుగా తన అమ్మమ్మ ఉంటున్న ధర్మారం గ్రామంలో ఉంటున్న విష్ణును.. ఖాళీగా తిరగకుండా వ్యవసాయ పనులకు వెళ్లాలని కుటుంబ సభ్యులు మందలించినట్లు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు మేనమామ ఇంట్లోనే గడ్డి మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు బాలుడిని నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు డాక్టర్ పావని రెడ్డి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
బాలలపై ఒత్తిడి, మందలింపుల విషయంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.








