పలాస: రాబోయే తుఫాన్ నేపథ్యంలో పలాస నియోజకవర్గ అధికార యంత్రాంగాన్ని ఎమ్మెల్యే గౌతు శిరీష అప్రమత్తం చేశారు. తుఫాన్ ప్రభావంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు నియోజకవర్గంలోని మూడు మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు, విద్యుత్ శాఖ డీఈతో ఎమ్మెల్యే టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు ఆయా మండలాల్లో చేపట్టిన ఏర్పాట్లు, అధికారుల సన్నద్ధతపై సమీక్షించారు.
లోతట్టు ప్రాంతాలు, తీరప్రాంత గ్రామాలు, వరద ముప్పు ఉన్న ప్రాంతాలతో పాటు బలహీనంగా ఉన్న ఇళ్లను ముందుగానే గుర్తించి ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని అధికారులకు స్పష్టం చేశారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందేలా కంట్రోల్ రూమ్‌లు, సహాయక బృందాలు, వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి మండలస్థాయి అధికారుల వరకు అందరూ అందుబాటులో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
తుఫాన్ కారణంగా విద్యుత్ స్తంభాలు, లైన్లు దెబ్బతినే అవకాశం ఉన్నందున విద్యుత్ శాఖ ప్రత్యేక అప్రమత్తతతో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రమాదకరంగా ఉన్న స్తంభాలు, విద్యుత్ లైన్లను ముందుగానే గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని, అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ సరఫరాను సురక్షితంగా పునరుద్ధరించేందుకు సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని డీఈని ఆదేశించారు.
ప్రజలు కూడా వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అధికారుల సూచనలు పాటించాలని, అత్యవసరం కాని సందర్భాల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు.








