E-PAPER

విజిలెన్స్ అంటే నేరస్థులను పట్టుకోవడం కాదు — తప్పులను ముందుగానే నివారించడమే నిజమైన విజిలెన్స్ : శిఖా గోయల్

సింగరేణి భవన్, హైదరాబాద్, అక్టోబర్ 30 (ప్రత్యేక ప్రతినిధి):
ప్రతీ వ్యక్తి తన వృత్తి జీవితంలోనే కాకుండా నిత్య జీవితంలోనూ నీతి, నిజాయతీ, పారదర్శకత వంటి విలువలను ఆచరించినప్పుడే సమాజం సక్రమంగా ముందుకు సాగుతుందని రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టర్ జనరల్, ఎక్స్ అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్ అన్నారు.

సింగరేణి భవన్‌లో గురువారం నిర్వహించిన విజిలెన్స్ అవగాహన వారోత్సవాల కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

విజిలెన్స్ అనేది కేవలం తప్పులు పట్టడం మాత్రమే కాదని, తప్పులు జరగకుండా ముందుగానే వ్యవస్థను పటిష్ఠం చేయడమే అసలైన విజిలెన్స్ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. శతాబ్దాలుగా భారతీయ ఆత్మలో నీతి, సత్యం, ధర్మం వంటి విలువలు మమేకమై ఉన్నాయని, ఆ విలువలను ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు.

నిజాయతీతో పనిచేయడం వల్లే ఢిల్లీ మెట్రో ప్రాజెక్టును సమయానికి పూర్తి చేయగలిగిన ధరన్, అమూల్ ద్వారా క్షీర విప్లవాన్ని సృష్టించిన వర్గీస్ కురియన్ వంటి మహానుభావులు సమాజానికి ఆదర్శమని ఆమె పేర్కొన్నారు. “నిజాయతీగా ఉంటూ పనులు చేయకపోవడం కూడా నేరమే” అని వ్యాఖ్యానించారు.

సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ద్వారా పారదర్శకతను పెంచి పౌరులకు సులభతర సేవలు అందించవచ్చని వివరించారు. విజిలెన్స్ వారోత్సవాలను ఏడాదిలో ఒక వారం వరకు పరిమితం చేయకుండా ప్రతీ రోజూ నిబద్ధతతో జీవన విధానంగా కొనసాగించాలని సూచించారు.

దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి ఉద్యోగులను ఉద్దేశించే అవకాశం కల్పించినందుకు ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ అధ్యక్షత వహించారు. సింగరేణి 136 ఏళ్ల ప్రస్థానంలో సాధించిన విజయాలు, రాబోయే విస్తరణ ప్రణాళికలు, మహిళా సాధికారత కోసం చేపట్టిన చర్యలను ఆయన వివరించారు.

తరువాత శిఖా గోయల్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, గౌతమ్ పొట్రు, తిరుమల రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్‌మెంట్) మరియు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బి. వెంకన్న, జీఎం (కోఆర్డినేషన్) టి. శ్రీనివాస్, అన్ని ఏరియాల జీఎంలు, కార్పొరేట్ జీఎంలు, అధికారులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News