13 మంది అరెస్ట్ 8.5 కోట్ల రూపాయల లావాదేవీలు బహిర్గతం
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 26 (వై 7 న్యూస్ ప్రతినిధి) :
జిల్లాలో భారీ స్థాయిలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. NCRP (నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్) ద్వారా అందిన ఫిర్యాదులపై టేకులపల్లి పోలీసులు, జిల్లా సైబర్ క్రైమ్ విభాగం సంయుక్తంగా నిన్న సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు టేకులపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి వారిని అరెస్ట్ చేశారు.
నకిలీ ఖాతాల ద్వారా కోట్ల లావాదేవీలు
టేకులపల్లిలో మీ-సేవా కేంద్రం నడుపుతున్న బోడా శ్రీధర్ టెలిగ్రామ్ యాప్ ద్వారా పరిచయమైన సైబర్ నేరగాళ్ల ప్రలోభాలకు లోనయ్యాడు. కమీషన్ కోసం ఇతను మరికొంతమంది యువకులను కలుపుకొని నకిలీ పత్రాలతో 60 కరెంట్ అకౌంట్లు తెరిచారు. ఆ ఖాతాల ద్వారా ఇతరుల డబ్బులు బదిలీ చేసి లాభాలు పొందుతున్నారు. గత ఆరు నెలల్లో సుమారు 8.5 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
స్వాధీనం చేసుకున్న వస్తువులు
అరెస్టు చేసిన వారివద్ద నుండి 12 సెల్‌ఫోన్లు, ఒక బ్యాంక్ పాస్‌బుక్‌ను స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా వీరి పేరుతో ఉన్న ఖాతాలపై ఇప్పటివరకు 108 ఫిర్యాదులు నమోదయ్యాయి.
అరెస్టు అయినవారి వివరాలు
ఈ కేసులో బోడా శ్రీధర్, బోడా రాజేష్, బోడా రాజన్న, బానోత్ జగదీశ్, తేజావత్ నరేశ్, పొలేపొంగు పవన్ కళ్యాణ్, భూక్య వీరన్న, జాటోత్ నరేశ్, బోడా జంపన్న, బోడా రాజారాం, భూక్య ప్రవీణ్, మాలోత్ ప్రవీణ్, ఉరిమల్ల భారత కృష్ణ లాంటి 13 మంది అరెస్ట్ అయ్యారు.
కోర్టుకు తరలింపు
అరెస్టయిన వారిని జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం ఇల్లందు కోర్టుకు తరలించినట్లు జిల్లా పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో టేకులపల్లి CI బి.సత్యనారాయణ, SI ఎ.రాజేందర్, సైబర్ క్రైమ్ CI ఎస్.జితేందర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజలకు హెచ్చరిక
సైబర్ నేరగాళ్లు విభిన్న పద్ధతుల్లో అమాయకులను మోసం చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా SP సూచించారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 నంబరుకు ఫిర్యాదు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.









