E-PAPER

గుండె మార్పిడి ఖర్చుపై రీయింబర్స్‌మెంట్ నిరాకరణకు బాంబే హైకోర్టు గట్టి చురక.

ముంబయి, జూన్ 10 వై 7 న్యూస్:
ఆరోగ్యం విలాసం కాదు — అది మౌలిక హక్కు. ఈ వాక్యం బాంబే హైకోర్టు తాజా తీర్పులో వ్యక్తమై, దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఒక పెద్ద మద్దతుగా మారింది.

సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసిన అనిరుధ్ ప్రతాప్‌రాయ్ నాన్సీ పదవీ విరమణ అనంతరం తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ముంబయిలో ఏ CGHS ఆసుపత్రి లోనూ గుండె మార్పిడి సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో, ఆయన అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రిలో ₹30 లక్షల ఖర్చుతో శస్త్రచికిత్స చేయించుకున్నారు.

అయితే, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) కేవలం ₹1.6 లక్షలే రీయింబర్స్ చేసింది. మిగిలిన మొత్తాన్ని తిరస్కరించడంతో, అనిరుధ్ నాన్సీ హైకోర్టును ఆశ్రయించారు.

తీర్పులో కోర్టు చేసిన ముఖ్య పరిశీలనలు:

1. ప్రాణాలను కాపాడే చికిత్సను “ప్రణాళిక ప్రకారం” అంటలేరు
గుండె మార్పిడి అనేది అత్యవసర శస్త్రచికిత్స. దీన్ని ప్రణాళికబద్ధంగా చేయదలచుకున్నదిగా భావించడం అసహజం అని కోర్టు పేర్కొంది.

2. ఆరోగ్యం హక్కు – జీవన హక్కులో భాగం
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం, జీవించే హక్కులో ఆరోగ్య సేవలు కూడా భాగమే. ఈ సందర్భంలో రీయింబర్స్‌మెంట్ నిరాకరణ జీవన హక్కును ఉల్లంఘించినదే అని కోర్టు తేల్చింది.

3. వైద్య సేవల లోపాన్ని ప్రజలు భరించరాదు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందుబాటులో లేకపోతే, నిబంధనల పేరుతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన వారిని శిక్షించటం అన్యాయం అని కోర్టు స్పష్టం చేసింది.

4. నియమాల కంటే మానవతా విలువలకు ప్రాధాన్యత
హై పవర్ కమిటీ యాంత్రికంగా వ్యవహరించిందని కోర్టు వ్యాఖ్యానించింది. నియమాల కంటే మానవీయ కోణం ముఖ్యమని హితవు పలికింది.

తుది తీర్పు:

పిటిషనర్‌కు ₹22,08,440/- రీయింబర్స్ చేయాలి

సంవత్సరానికి 9% వడ్డీ చెల్లించాలి

4 వారాలలోపు మొత్తం చెల్లించాలని ఆదేశం

CGHS వ్యవస్థపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది

తీర్పు ప్రాధాన్యం

ఈ తీర్పు ద్వారా ప్రభుత్వ విధానాలలో మానవతా స్పర్శ అవసరమని మరోసారి న్యాయవ్యవస్థ గుర్తు చేసింది. శాసన నియమాలకు లోబడి ఉన్నా, మౌలిక హక్కులకు అనుగుణంగా వాటిని సర్దుబాటు చేయాల్సిన అవసరం ప్రభుత్వం ముందు నిలిచింది.

పెన్షనర్లు, వృద్ధులు తమ ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా, గౌరవంతో బతికే హక్కు కోసం న్యాయాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి రావడం, ప్రభుత్వ విధానాలపై కొత్త ఆలోచనకు నాంది పలుకుతోంది.

రచయిత,
వి. కృష్ణమోహన్, జాతీయ ఛైర్మన్, కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్ కాన్ఫెడరేషన్ (CCGGOO),
కార్యదర్శి, ఆల్ పెన్షనర్లు & రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (TAPRPA)
📩 kmdrdo@gmail.com

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :