శభాష్ గ్రేసీ డాగ్;
అశ్వాపురం: భద్రాది కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో అశ్వాపురం మండల కేంద్రంలోని చవిటి గూడెంలో సోమవారం పోలీసులు గ్రేసి జాగిలంతో తనిఖీలు చేయగా పార్వతమ్మ అనే మహిళ వంట గదిలో గిన్నెల కింద దాచిపెట్టిన కేజీ గంజాయిని జాగిలం పట్టించింది. ఇంతకాలం పోలీసులు కళ్ళు కప్పి గంజాయి వ్యాపారం చేసిన వారికి ఈ జాగిలంతో చుక్కలే.. ఏ మూలన పెట్టిన ఏ గోతిలో దాచిపెట్టిన అది ఇట్టే పట్టేస్తుంది. మండల కేంద్రంలోని వారాంతపు సంతలో పోలీస్ జాగిలం గ్రేసిని వారి వెంట తీసుకెళ్లారు. చవిటిగూడెంలో ఒక ఇంటిలో గిన్నెల క్రింద దాసి ఉంచిన గంజాయి వాసనను పసిగట్టిన ఆ జాగిలం వంట గదిలోకి వెళ్లి గంజాయిని పట్టించింది. దీంతో పోలీసులు కేజీ గంజాయిని స్వాధీనం చేసుకొని మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గత కొంతకాలంగా పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్న గంజాయి స్మగ్లర్ ను పోలీస్ జాగిలం గ్రేసీ పట్టించడంతో పలువురు అభినందించారు. గంజాయి స్మగ్లర్ ఆటలిక సాగవని గంజాయి విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని సీఐ అశోక్ రెడ్డి అన్నారు.