హైదరాబాద్
శాసనసభలో త్వరలో ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్లో విద్యా రంగానికి 15 శాతానికి తగ్గకుండా నిధులు కేటాయించాలని,
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీల్లో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ పేర్కొన్నారు. సమాజంలో పేదరిక నిర్మూలనకు విద్య కీలక పాత్ర పోషిస్తుందని, నాణ్యమైన విద్యను సామాన్య ప్రజలకు ఉచితంగా అందిస్తే సమాజంలో పెను మార్పులు సంభవిస్తాయని ఆయన సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. పెట్టుబడిదారీ వర్గ పాలకులు కావాలనే ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహిస్తున్నారని, ఈ విషయంలో సీఎం రేవంత్ అతీతుడు కాదని ఆయన అన్నారు.
“తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తర్వాత, ప్రభుత్వ ప్రాథమిక స్థాయి నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందించేందుకు, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ విద్యా సంస్థలకు సమానమైన నాణ్యమైన విద్యను కల్పించేందుకు తగు ప్రాధాన్యత ఇస్తామని చెప్పింది. అయితే, గత పది సంవత్సరాల్లో మునుపటి ప్రభుత్వం పాఠశాల విద్యకు రాష్ట్ర బడ్జెట్‌లో సగటున కేవలం 6.6% మాత్రమే కేటాయించింది.
ప్రస్తుత ప్రభుత్వం విద్యను బలోపేతం చేసి, 15% బడ్జెట్‌ను విద్యకు కేటాయిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినప్పటికీ, 2024-25 రాష్ట్ర బడ్జెట్‌లో కేవలం 7.6% మాత్రమే కేటాయించింది.
భారీగా తగ్గిన నిధుల కేటాయింపు ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలను మరింత దిగజారుస్తోంది. పాఠశాల విద్యా నేషనల్ పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్‌లో తెలంగాణ 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 35వ స్థానానికి పడిపోయింది. కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు కూడా బోధనా మరియు బోధనేతర సిబ్బంది కొరత, మౌలిక వసతుల కొరత పరిశోధన నిధుల కొరత వంటి సమస్యలను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి.
పేదలు, బలహీన వర్గాల ప్రజలకు విద్యే విముక్తి మార్గం. తగిన నిధులతో నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వ చట్ట బద్ధ బాధ్యత.
తెలంగాణలో విద్యావ్యవస్థ దుస్థితిని గుర్తించి, విద్యను అభివృద్ధి మార్గంలో పెట్టేందుకు రాష్ట్ర బడ్జెట్‌లో 15% విద్యకు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం” అని కేఎస్ఆర్ గౌడ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.