తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. సేలంలో 25 కొత్త ప్రభుత్వ టౌన్ బస్సులను టీవీకే పార్టీ జెండాను పోలిన పసుపు, ఎరుపు రంగుల్లో సిద్ధం చేయడం రాజకీయ చర్చకు దారితీసింది. జాన్సన్‌పేట్ ప్రాంతం నుంచి ఈ బస్సుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రభుత్వ బస్సులకు అధికార పార్టీ జెండాను పోలిన రంగులు వేయడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఆస్తులకు పార్టీ రంగులు ఉపయోగించడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తమిళనాడులో ఇలాంటి రాజకీయ రంగుల సంస్కృతిని తీసుకొస్తున్నారంటూ డీఎంకే విమర్శలు చేస్తున్నట్లు సమాచారం.
అయితే బస్సులకు ఈ రంగులను ఎవరి ఆదేశాలతో వేశారు? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమా? లేక స్థానిక స్థాయిలో రంగుల ఎంపిక జరిగిందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ అంశంపై రవాణాశాఖ నుంచి అధికారిక స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. గతంలోనూ పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిన తర్వాత ప్రజా ఆస్తులకు అధికార పార్టీలను పోలిన రంగులు వేయడం వివాదాలకు దారితీసిన సందర్భాలు ఉన్నాయి.









