కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ క్రైమ్ థ్రిల్లర్ ‘దాయ్‌రా’ సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. జాతీయ అవార్డు గ్రహీత మేఘ్నా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జంగ్లీ పిక్చర్స్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై వినీత్ జైన్, ధవల్ గడా నిర్మించారు. ఇందులో పృథ్వీరాజ్ డీసీపీ రామన్ కుమార్‌గా, కరీనా డీసీపీ అజూని కోహ్లీగా పోలీస్ అధికారుల పాత్రల్లో కనిపించనున్నారు.
నిజజీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబర్ 15న విడుదల చేశారు. ట్రైలర్, ప్రోమోల్లో కనిపించిన కొన్ని సన్నివేశాలు 2019లో హైదరాబాద్‌లో జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశపై అత్యాచారం, హత్య ఘటనతో పాటు ఆ తర్వాత జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్‌ను పోలి ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. దీంతో ‘దాయ్‌రా’ కథకు ఆ ఘటనలతో ఏమైనా సంబంధం ఉందా అనే చర్చ మొదలైంది.
ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమా దిశ కేసు, అనంతరం జరిగిన ఎన్‌కౌంటర్‌నే ఆధారంగా చేసుకుని రూపొందించారనే వార్తలు సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. అయితే సినిమా పూర్తిగా అదే కేసు ఆధారంగా తెరకెక్కిందా లేదా అనే విషయంపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. సినిమా విడుదల తర్వాతే కథాంశం, వాస్తవ ఘటనలతో ఉన్న పోలికలపై పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉంది.









