స్పామ్, ప్రమోషనల్ కాల్స్ నియంత్రణ అంశంలో భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (TRAI), ప్రముఖ కాలర్ ఐడీ యాప్ ట్రూకాలర్ మధ్య వివాదం ముదిరింది. 140, 1600 సిరీస్‌లతో ప్రారంభమయ్యే ఫోన్ నంబర్లను థర్డ్-పార్టీ యాప్స్ స్పామ్‌గా ట్యాగ్ చేయడం లేదా బ్లాక్ చేయడంపై ట్రాయ్ కీలక స్పష్టత ఇచ్చింది.
ఈ నంబర్లు అధికారిక టెలిమార్కెటింగ్, సేవా కమ్యూనికేషన్‌ల కోసం కేటాయించినవని ట్రాయ్ పేర్కొంది. వీటిని అనుమతి లేకుండా స్పామ్‌గా గుర్తించడం వల్ల వినియోగదారులు ముఖ్యమైన సందేశాలు, కాల్స్‌ను కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో కాలర్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌లపై అవసరమైన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ నుంచి అదనపు అధికారాలను ట్రాయ్ కోరినట్లు సమాచారం. స్పామ్ కాల్స్ నియంత్రణతో పాటు వినియోగదారులకు అవసరమైన కమ్యూనికేషన్ అందేలా చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.








