కూనవరం , ( వై7 న్యూస్ తెలుగు) ఆగస్టు 30: పోలవరం జిల్లా, కూనవరం మండల ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన విద్యాసంస్థల్లో భద్రత, కనీస వైద్య సౌకర్యాల లేమి మరో చిన్నారు ప్రాణాన్ని బలిగొంది. కూనవరం మండలం కోతులగుట్టలోని ప్రభుత్వ గురుకులం బాలికల ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న తెల్లం జాహ్నవి (12) అనే విద్యార్థిని తీవ్ర జ్వరంతో మృతి చెందింది. పల్లూరు గ్రామానికి చెందిన ఈ గిరిజన బాలిక మరణానికి పాఠశాల యాజమాన్యం, వార్డెన్ల నిర్లక్ష్యమే కారణమంటూ స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.సకాలంలో వైద్యం అందించక బాలిక మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తరలిస్తుండగా మార్గం మధ్యలో విద్యార్థి మృతి చెందింది. బాధిత కుటుంబ సభ్యులు మరియు గిరిజన సంఘాల కథనం ప్రకారం.. గత రెండు, మూడు రోజులుగా జాహ్నవి తీవ్రమైన జ్వరంతో బాధపడుతోంది. హాస్టల్‌లోనే ఉంటున్న బాలిక పరిస్థితి విషమిస్తున్నా స్కూల్ సిబ్బంది గానీ, వార్డెన్ గానీ సకాలంలో స్పందించలేదు. కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా, మెరుగైన వైద్యం అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారు. జ్వరం బాగా ముదిరి, పరిస్థితి చేతులు దాటిన తర్వాతే అధికారులు స్పందించారని, ఫలితంగానే తమ బిడ్డ కళ్లముందే ప్రాణాలు కోల్పోయిందని తల్లి తండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఏజెన్సీలో ఆగని వరుస జ్వరాలు.. పర్యవేక్షణ లోపం ఇటీవల ఏజెన్సీ ప్రాంతాల్లోని పాఠశాలలు, హాస్టళ్లలో వరుసగా ఇటువంటి విషాదకర సంఘటనలు చోటుచేసుకోవడం గిరిజన తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు, వైరల్ జ్వరాలు ప్రబలుతున్నా జాగ్రత్త చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఐటీడీఏ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే గురుకులాల్లో పిల్లల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోతోందని గిరిజన నాయకులు మండిపడుతున్నారు. విద్యార్థిని తెల్లం జాహ్నవి మృతికి కారణమైన కోతులగుట్ట గురుకులం ప్రిన్సిపాల్, సంబంధిత వార్డెన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. ఆందోళన స్థలానికి చేరుకున్న ఐటిడిఏ పీఓ శుభం నొక్వల్ బాధిత కుటుంబంతో మాట్లాడారు బాధిత పేద గిరిజన కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఎక్స్‌గ్రేషియా ప్రకటించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.








