చాలామందిని ఇబ్బంది పెట్టే సాధారణ జీర్ణ సమస్యల్లో గ్యాస్ ట్రబుల్ కూడా ఒకటి. పొట్టలో గ్యాస్ అధికంగా ఏర్పడి పేగుల్లో చిక్కుకుపోతే ఉబ్బరం, అసౌకర్యంతో పాటు కొన్నిసార్లు తీవ్రమైన నొప్పి కూడా రావచ్చు. ఈ నొప్పి ఛాతీ, వీపు, పక్కటెముకల ప్రాంతాలకు వ్యాపించి గుండెల్లో నొప్పిలా అనిపించే అవకాశం ఉంటుంది. అయితే ఛాతీలో నొప్పి వచ్చిన ప్రతిసారీ దాన్ని గ్యాస్ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ అనుపమ ఎన్.కె ప్రకారం.. జీర్ణక్రియ సమయంలో శరీరంలో సహజంగానే గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. సాధారణంగా ఇది తేన్పులు లేదా అపానవాయువు రూపంలో బయటకు వెళ్లిపోతుంది. అయితే కొన్ని సందర్భాల్లో పేగుల్లోని మలుపుల వద్ద గ్యాస్ చిక్కుకుపోయి బయటకు వెళ్లకుండా ఇబ్బంది కలిగిస్తుంది. ఈ పరిస్థితినే ‘ట్రాప్డ్ గ్యాస్’ అని పిలుస్తారు.
ట్రాప్డ్ గ్యాస్ కారణంగా పొట్ట ఉబ్బరం, బిగుతు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. నొప్పి ఛాతీ వైపు కూడా అనిపించే అవకాశం ఉండటంతో కొందరు ఆందోళనకు గురవుతారు. అయితే ఛాతీ నొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చెమటలు, తల తిరగడం, వికారం లేదా చేతి, దవడ వైపు నొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.








