E-PAPER

ఇక మీకు ‘అన్ నోన్’ నంబర్ల నుంచి కాల్స్ రావు..! నవంబర్ 1 నుంచి కొత్త రూల్..!

దేశంలో తెలియని నంబర్ల నుంచి వచ్చే స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచి అన్ని టెలికాం సంస్థలు ‘కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్’ (సీఎన్ఏపీ) సేవను తప్పనిసరిగా అందించాలని టెలికమ్యూనికేషన్స్ విభాగం ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త విధానంతో వినియోగదారులకు ఫోన్ చేసే వారి పేరు, నంబర్‌తో సహా కనిపిస్తుంది.

ఎలా పనిచేస్తుంది?
ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చాక, 4G లేదా 5G నెట్‌వర్క్‌లలో మీకు ఇన్‌కమింగ్ కాల్ వచ్చినప్పుడు, కాల్ చేసే వారి నంబర్‌తో పాటు వారి పేరు కూడా ఫోన్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. ఒకవేళ ఆ నంబర్ మీ కాంటాక్ట్స్‌లో సేవ్ చేసి ఉంటే, మీరు సేవ్ చేసుకున్న పేరే కనిపిస్తుంది. 

సేవ్ చేయని దేశీయ నంబర్ల విషయంలో సిమ్ కార్డు తీసుకునేటప్పుడు సదరు వినియోగదారుడు నమోదు చేసుకున్న పేరును టెలికాం ఆపరేటర్ డేటాబేస్ నుంచి సేకరించి చూపిస్తుంది. ఇక అంతర్జాతీయ కాల్స్ వస్తే ‘ఇంటర్నేషనల్ కాల్’ అని ప్రత్యేకంగా సూచిస్తుంది.

ప్రస్తుతానికి ఈ సేవ 4G, 5G నెట్‌వర్క్‌ల వినియోగదారులకు ఆటోమేటిక్‌గా ప్రారంభమవుతుంది. 2G, 3G, ల్యాండ్‌లైన్ నెట్‌వర్క్‌లలో దీని అమలుపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. అయితే, గోప్యత కోరుకునే వారి కోసం కూడా ఒక వెసులుబాటు ఉంది. ‘కాలింగ్ లైన్ ఐడెంటిఫికేషన్ రిస్ట్రిక్షన్’ (సీఎల్ఐఆర్‌) సేవను యాక్టివేట్ చేసుకున్న వారి పేర్లు మాత్రం ఇతరులకు కనిపించవు.

వ్యాపార, బల్క్ కనెక్షన్ల విషయంలో ధ్రువీకరణ తర్వాత వారి రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్ లేదా జీఎస్టీ ట్రేడ్ నేమ్ వంటి పేరును ఉపయోగించుకునేందుకు టెలికాం ఆపరేటర్లు అనుమతించవచ్చు. కాల్ ముగిసిన తర్వాత కాలర్ పేరును ఫోన్‌లో నిల్వ చేయలేని విధంగా తగిన భద్రతా చర్యలు పాటించాలని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా’ (టీఆర్ఏఐ) సిఫారసులకు అనుగుణంగా, వినియోగదారులకు సురక్షితమైన కాలింగ్ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!