E-PAPER

‘సర్’ వివాదం.. 17 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ‘స్పెషల్ సమ్మరీ రివిజన్‌’..!

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (సర్) ప్రక్రియపై చెలరేగుతున్న వివాదాల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ‘సర్’ నిర్వహణలో తలెత్తిన లోపాలను సరిదిద్దే లక్ష్యంతో, 17 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితాకు “స్పెషల్ సమ్మరీ రివిజన్” (ఎస్ఎస్ఆర్) చేపట్టాలని గురువారం ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా ఓటు హక్కు పొందే యువతతో పాటు, సాంకేతిక కారణాల వల్ల జాబితాలో పేర్లు నమోదు కాని వారిని చేర్చేందుకు ఈ ప్రక్రియ దోహదపడనుంది.

పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, బీహార్, తమిళనాడు వంటి కీలక రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. 2027 జనవరి 1వ తేదీని అర్హత తేదీగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. తాజా షెడ్యూల్ ప్రకారం, నవంబర్ 12న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించి, అభ్యంతరాల స్వీకరణ అనంతరం 2027 జనవరి 4న తుది జాబితాను విడుదల చేస్తారు. కాగా, 2027 ఫిబ్రవరి నాటికి ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకుంది.

వివాదానికి దారితీసిన సర్

‘సర్’ ప్రక్రియలో భాగంగా భారీస్థాయిలో ఓటర్ల పేర్లను తొలగించడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా, ఫారం-6తో పాటు ఓటర్లు ఒక అదనపు డిక్లరేషన్ సమర్పించాలన్న నిబంధన వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. సుమారు 20 ఏళ్ల క్రితం జరిగిన ‘సర్’ వివరాలతో ప్రస్తుత దరఖాస్తుదారుల తల్లిదండ్రుల వివరాలను అనుసంధానం చేయాలని కోరడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిబంధనలు అసంబద్ధంగా ఉన్నాయని, ఓటర్లను ఇబ్బందులకు గురిచేసేలా ఉన్నాయని ఆరోపిస్తున్నాయి. ఈ వివాదం నేపథ్యంలో ‘ఇండియా’ కూటమి పార్టీలు, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వంటి యువజన సంఘాలు ఢిల్లీలో నిరసనలు చేపట్టాయి. తక్షణమే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఏపీ, తెలంగాణలో పరిస్థితి ఏంటి?

ప్రస్తుతం ‘సర్’ ప్రక్రియ కొనసాగుతున్న లేదా ఇటీవలే పూర్తయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ‘ఎస్ఎస్ఆర్’ షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అదేవిధంగా, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇప్పటివరకు ‘సర్’ ప్రారంభం కాని హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లలో కూడా ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ను తగిన సమయంలో వెల్లడిస్తామని ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సెప్టెంబర్ 29న ఇచ్చిన ఆదేశాల మేరకు, అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని రాష్ట్రాల అధికారులకు సూచించినట్లు ఈసీ గుర్తు చేసింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!