నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు, ఆకస్మిక ప్రవాహాలు, కొండచరియల ఘటనల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. నేపాల్‌లో 320 మంది భారతీయులు ప్రస్తుతం గల్లంతైనట్లు లేదా వారిని సంప్రదించలేకపోతున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. వారి ఆచూకీ కోసం నేపాల్ అధికారులతో కలిసి భారత ఏజెన్సీలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి.
మరోవైపు చైనా వైపు చిక్కుకుపోయిన భారతీయుల్లో పలువురు సురక్షితంగా నేపాల్‌కు చేరుకుంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి కాఠ్మాండూకు చేరుకున్న తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయులు శుక్రవారం ఢిల్లీకి సురక్షితంగా చేరుకున్నారు. అలాగే నేపాల్‌లోని త్రిశూలి-1 జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయులను రెస్క్యూ బృందాలు సురక్షితంగా తరలించాయి.
గల్లంతైన భారతీయుల ఆచూకీ కోసం సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఢిల్లీ నుంచి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వెల్లడించింది. భారీ వరదల కారణంగా నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో సహాయక చర్యలు సవాలుగా మారినప్పటికీ.. చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా తరలించేందుకు భారత్ నేపాల్, చైనా అధికారులతో సమన్వయం చేస్తోంది.








