మణుగూరు, జూలై 13 (వై7 న్యూస్):
పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండల కేంద్రంలో తొలగించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని కోరుతూ దళిత సంఘాల నాయకులు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు విచ్చేసిన కేంద్ర మంత్రిని కలిసి దళిత సంఘాల ప్రతినిధులు అశ్వాపురం మండల కేంద్రంలో ఇటీవల ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆర్ అండ్ బి, జాతీయ రహదారుల శాఖ అధికారులు తొలగించారని వివరించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి అదే ప్రాంతంలో ఏర్పాటు చేసేలా సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుని, అంబేద్కర్ విగ్రహ పునరుద్ధరణ అంశంపై అవసరమైన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు దళిత సంఘాల నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాల జన సమితి పినపాక నియోజకవర్గ అధ్యక్షుడు చెట్టి సురేష్, ఎమ్మార్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు ఇసంపల్లి కృష్ణ, మాల మహానాడు జిల్లా సహాయ కార్యదర్శి మేకల భాస్కర్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు వల్లెపోగు వెంకటేశ్వర్లు, కొమ్ము హుస్సేన్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.









