E-PAPER

గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులు పట్టివేత.. డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు

కొత్తగూడెం , జూలై 13 (వై 7 న్యూస్);
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల నిర్మూలన కోసం చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా లోతువాగు ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసులు తనిఖీలు నిర్వహించగా ముగ్గురు యువకులు గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయింది. దీంతో వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు.
పోలీసులు యువకులకు గంజాయి వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, మానసిక, కుటుంబ, సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం న్యాయస్థానం ఆదేశాల మేరకు వారిని డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించారు.
ఈ సందర్భంగా కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల నియంత్రణ విషయంలో పోలీసులు ఎలాంటి రాజీ పడబోరని, యువత భవిష్యత్తును కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలతో పాటు చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.
మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు పోలీసులకు సహకరించాలని, గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా డయల్-112కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఈ తనిఖీల్లో చుంచుపల్లి సీఐ ఆర్. వెంకటేశ్వర్లు, ఎస్సై అఖిలతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!