జమ్మూకశ్మీర్ రాజకీయాల్లో అధికార నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ), ప్రతిపక్ష బీజేపీ మధ్య వివాదం మరింత ముదిరింది. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన జమ్మూకశ్మీర్ బీజేపీ విభాగం ఆయనకు రూ.100 కోట్ల పరువు నష్టం దావా నోటీసులు జారీ చేసింది. ఏడు రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇటీవల శ్రీనగర్‌లో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, జమ్మూకశ్మీర్‌లోని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు భారీ మొత్తంలో నగదు, మంత్రి పదవులు, అలాగే పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరణ వంటి ఆఫర్లు ఇచ్చేందుకు ప్రయత్నించారని ఆయన పేర్కొన్నారు.
ఈ ఆరోపణలను బీజేపీ పూర్తిగా ఖండించింది. ఆధారాలు లేని, పరువు తీసే వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఒమర్ అబ్దుల్లాపై పరువు నష్టం దావా నోటీసులు పంపింది. ఈ వ్యవహారం జమ్మూకశ్మీర్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.








