ఆఫ్రికా ఖండంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటైన దక్షిణాఫ్రికా అక్రమ వలసదారులపై కఠిన చర్యలు చేపట్టింది. ఉపాధి కోసం పొరుగు దేశాల నుంచి భారీగా వలసలు రావడంతో దేశంలో సామాజిక, రాజకీయ ఒత్తిడి పెరిగింది. స్థానికుల నుంచి వ్యతిరేకత ఎక్కువ కావడంతో ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించింది.
‘వలసల నిర్వహణ’ పేరుతో చేపట్టిన ఈ చర్యల్లో దేశంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను గుర్తించి స్వదేశాలకు పంపిస్తోంది. ఈ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభమైన కేవలం ఐదు వారాల్లోనే 53,499 మంది విదేశీయులను బహిష్కరించడంతో పాటు వారి స్వదేశాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
అక్రమ వలసలను నియంత్రించడం, స్థానికులకు ఉపాధి అవకాశాలను కాపాడడం లక్ష్యంగానే ఈ చర్యలు చేపట్టినట్లు దక్షిణాఫ్రికా ప్రభుత్వం తెలిపింది. అయితే మానవ హక్కుల సంఘాలు ఈ చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, వలసదారుల హక్కులను కూడా పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.








