E-PAPER

బిట్స్ పిలానీ ప్రొఫెసర్ల అద్భుత ఆవిష్కరణ.. నిమిషాల్లో కిడ్నీ సమస్యల గుర్తింపు

 

హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీ క్యాంపస్‌కు చెందిన ప్రొఫెసర్లు కిడ్నీ ఆరోగ్య పరీక్షల్లో విప్లవాత్మక మార్పు తీసుకురాగల పోర్టబుల్ పరికరాన్ని అభివృద్ధి చేశారు. లేజర్ గ్రాఫేన్ సాంకేతికత, అధునాతన ఎలక్ట్రోకెమికల్ సెన్సార్లతో రూపొందించిన ఈ పరికరం ద్వారా క్రియాటినైన్, యూరియా, యూరిక్ యాసిడ్ వంటి కీలక బయోమార్కర్ల స్థాయిలను కేవలం నిమిషాల్లోనే ఖచ్చితంగా గుర్తించవచ్చు. స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం చేసి ప్రత్యేక అప్లికేషన్ ద్వారా ఫలితాలను వెంటనే తెలుసుకునే సౌకర్యం ఇందులో ఉంది.

ఈ పరిశోధనకు బిట్స్ హైదరాబాద్ క్యాంపస్‌కు చెందిన డా. పార్వతి నాయర్, డా. స్వయంశ్రీ, డా. ఆర్.ఎన్. పొన్నాలగు, డా. సంకేత్ గోయల్ నేతృత్వంలోని బృందం నాయకత్వం వహించింది. సాధారణంగా కిడ్నీ సమస్యల నిర్ధారణ కోసం రక్తం లేదా మూత్ర నమూనాలను ల్యాబ్‌లకు పంపాల్సి వస్తుంది. అయితే ఈ చిన్న, తేలికైన పరికరం ద్వారా ఇంటి వద్దే లేదా గ్రామీణ ప్రాంతాల్లోనే పరీక్షలు నిర్వహించవచ్చు. ల్యాబ్ పరీక్షలతో సమానంగా ఖచ్చితమైన ఫలితాలు వచ్చినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఈ అధ్యయనం అంతర్జాతీయ జర్నల్ ScienceDirectలో ప్రచురితమైంది.

ముఖ్యంగా గ్రామీణ, సబర్బన్ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు పరిమితంగా ఉన్న నేపథ్యంలో ఈ పరికరం ఎంతో ఉపయోగపడనుంది. కిడ్నీ సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి సకాలంలో చికిత్స అందించే అవకాశాన్ని ఇది కల్పిస్తుంది. ప్రస్తుతం ఈ పరికరాన్ని క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసి వాణిజ్యీకరణ దిశగా తీసుకెళ్లేందుకు పరిశోధకుల బృందం కృషి చేస్తోంది. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ ఆరోగ్య సంరక్షణలో ఈ ఆవిష్కరణ కీలక మార్పు తీసుకురావొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News