E-PAPER

విద్యుత్ షాక్‌తో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి కేసులో నలుగురు అరెస్ట్


పాల్వంచ, ఆగస్టు 15 (వై7 న్యూస్): అటవీ జంతువులను వేటాడేందుకు అక్రమంగా విద్యుత్ తీగలు అమర్చిన ఘటనలో విద్యుత్ షాక్‌కు గురై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్ మృతి చెందిన కేసులో బూర్గంపాడు పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 11వ తేదీ రాత్రి నకిరేపేట అటవీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు అటవీ జంతువులను విద్యుత్ షాక్ ద్వారా వేటాడేందుకు అక్రమంగా విద్యుత్ తీగలు అమర్చినట్లు సమాచారం అందడంతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్, డీఆర్వో అనార్కలి మరియు ఇతర అటవీ సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ నిందితుల కోసం గాలిస్తుండగా అక్రమంగా అమర్చిన విద్యుత్ తీగ తగలడంతో నవీన్ తీవ్ర విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు.

ఈ ఘటనపై డీఆర్వో అనార్కలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేక గాలింపు చర్యలు నిర్వహించిన పోలీసులు లక్ష్మిపురం గ్రామంలో ఆవుల నాగిరెడ్డి, దాసరి నరేష్, తాటి వీరబాబులను అదుపులోకి తీసుకున్నారు. వారి సమాచారంతో నాగినేనిప్రోలు రెడ్డిపాలెంకు చెందిన కన్నెదారి అనంతయ్యను కూడా అరెస్ట్ చేశారు.

అరెస్ట్ చేసిన నిందితుల వద్ద నుంచి బైండింగ్ వైరు, విద్యుత్ తీగలు అమర్చేందుకు ఉపయోగించిన కర్రలు పాతే గడ్డపలుగు, ఖాళీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

అటవీ జంతువుల వేట కోసం విద్యుత్ తీగలు అమర్చడం అత్యంత ప్రమాదకరమని, ఇలాంటి చర్యల వల్ల అటవీ జంతువులతో పాటు అధికారులు, సాధారణ ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని పోలీసులు హెచ్చరించారు. అక్రమ వేట కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!