E-PAPER

ఉపాధి కార్మికుల జీవనోపాధిని దెబ్బతీస్తున్న కేంద్ర ప్రభుత్వం: తెలంగాణ వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం

బూర్గంపాడు, జూన్ 18 (వై7 న్యూస్): బూర్గంపాడు మండలం మోతే గ్రామంలోని ఫారెస్ట్ నీటి కుంట వద్ద ఉపాధి హామీ పనులు చేస్తున్న కార్మికులను తెలంగాణ వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల కారణంగా ఉపాధి హామీ కార్మికులు జీవనోపాధి కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 125 రోజుల పని కల్పిస్తామని ప్రకటించినప్పటికీ, చాలా మంది కార్మికులకు కేవలం 100 రోజుల పనితోనే సరిపెడుతూ, పని లేదంటూ పంపిస్తున్నారని ఆరోపించారు.

అంతేకాకుండా, వృద్ధాప్యం కారణంగా కంటి చూపు తగ్గడం, ముఖ గుర్తింపు సమస్యలు, సెల్‌ఫోన్ ఆధారిత హాజరు నమోదులో ఇబ్బందులు వంటి కారణాలతో పలువురు కార్మికులను పనికి దూరం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన పూర్తి కూలీ చెల్లింపులు అందక, తక్కువ మొత్తాలనే మస్టర్లలో నమోదు చేస్తున్నారని కార్మికులు వాపోయారని చెప్పారు.

ఉపాధి హామీ పథకంలో అమలవుతున్న నిబంధనలు కార్మికులకు మరింత ఇబ్బందులు కలిగిస్తున్నాయని, దీంతో చాలామంది పనికి దూరమవుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కొనసాగించాలని, పథక స్వరూపాన్ని దెబ్బతీసే చర్యలను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తుమ్మల గురుస్వామి, గుమ్మడి మంగ, ఆదిలక్ష్మి, రాధా, దుర్గా, శ్రీను, జాన్ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News