ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్‌ఎక్స్ (SpaceX) ఏఐ కోడింగ్ స్టార్టప్ ‘కర్సర్’ (Cursor) ను ఏకంగా $60 బిలియన్ల భారీ ధరకు కొనుగోలు చేయడంతో ఆ సంస్థ కో-ఫౌండర్ అయిన 25 ఏళ్ల అమన్ సాంగర్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ ఆల్-స్టాక్ డీల్ ద్వారా భారత సంతతికి చెందిన అమన్ వాటా కింద ఆయనకు దాదాపు $2.7 బిలియన్లు (సుమారు రూ. 22 వేల కోట్లు) దక్కనున్నాయి. దీంతో కేవలం 25 ఏళ్ల వయసులోనే టెక్ ప్రపంచంలోని అతి పిన్న వయస్కులైన బిలియనీర్ల జాబితాలో ఆయన చోటు సంపాదించారు.
న్యూయార్క్‌లో స్థిరపడిన భారతీయ వలసదారుల కుటుంబంలో జన్మించిన అమన్‌కు చిన్నప్పటి నుంచే టెక్నాలజీపై విపరీతమైన ఆసక్తి ఉండేది. ఐఐటీ-బాంబే (IIT Bombay) పూర్వ విద్యార్థి అయిన ఆయన తండ్రి అరవింద్ సాంగర్, అలాగే ఆర్థోడాంటిస్ట్ అయిన తల్లి శిల్పా సాంగర్ ప్రోత్సాహంతో అమన్ కేవలం 14 ఏళ్ల వయసులోనే కోడింగ్ నేర్చుకోవడం ప్రారంభించాడు. ఆ తర్వాత ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న సమయంలోనే తన భవిష్యత్ కో-ఫౌండర్లను కలుసుకుని స్టార్టప్ ఆలోచనలకు శ్రీకారం చుట్టాడు.
ఎంఐటీ (MIT) లో తన మిత్రులతో కలిసి 2022లో ‘కర్సర్’ మాతృసంస్థ అయిన యానిస్ఫియర్ (Anysphere) ను అమన్ స్థాపించాడు. సాఫ్ట్‌వేర్ డెవలపర్లు సులువుగా కోడింగ్ రాసేందుకు, ఎడిట్ చేసేందుకు, అలాగే తప్పులను సరిదిద్దేందుకు సహాయపడే ఈ ఏఐ ఆధారిత కోడింగ్ అసిస్టెంట్ అతి తక్కువ కాలంలోనే టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఎన్విడియా, అడోబ్, ఉబెర్, పేపాల్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది డెవలపర్లు దీనిని వాడుతున్నారు. ఒక యూనివర్సిటీ ప్రాజెక్ట్‌గా ప్రారంభమైన కర్సర్ ప్రయాణం, నేడు ఎలాన్ మస్క్ దృష్టిని ఆకర్షించి ఏకంగా $60 బిలియన్ల డీల్ స్థాయికి ఎదగడం నిజంగా స్ఫూర్తిదాయకం.








