వెంటనే బీటీ రోడ్డు నిర్మించాలని డిమాండ్
బూర్గంపాడు, జూన్ 13: బూర్గంపాడు మండలంలోని పినపాక పట్టినగర్ గ్రామం నుంచి జిన్నిగట్టు వరకు వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతిని ప్రజలకు ప్రమాదకరంగా మారిందని సీపీఎం బూర్గంపాడు మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఉప్పుసాక, జిన్నిగట్టు, ఒడ్డుగూడెం గ్రామాలకు వెళ్లే ఈ రహదారిని వెంటనే బీటీ రోడ్డుగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామసభల్లో ప్రతిసారి రహదారి మంజూరైందని చెబుతున్నప్పటికీ, సంవత్సరాలు గడుస్తున్నా పనులు ప్రారంభం కాకపోవడం బాధాకరమన్నారు. గ్రామసభల్లో తీర్మానాలు చేసినా అమలు చేయకపోవడంపై అధికారులను, ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు.
ఉప్పుసాక గ్రామంలో ఆశ్రమ పాఠశాల, గిరిజన హాస్టల్ ఉండటంతో ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ రహదారిపై ప్రయాణిస్తున్నారని తెలిపారు. రహదారిపై పెద్ద పెద్ద గోతులు ఏర్పడటంతో ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగాయని, రాత్రి సమయంలో గోతుల్లో పడి పలువురు గాయపడిన ఘటనలు ఉన్నాయని చెప్పారు. ఇటీవల రెంటాల శ్రీను రహదారిపై ఉన్న గోతిలో పడి తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు.
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అలాగే ఐటీడీఏ అధికారులు ఈ మార్గంలో పలుమార్లు ప్రయాణించినప్పటికీ సమస్యను పట్టించుకోకపోవడం విచారకరమని సీపీఎం నాయకులు విమర్శించారు.
సుమారు ఏడు కిలోమీటర్ల మేర ఉన్న ఈ రహదారిని వెంటనే బీటీ రోడ్డుగా నిర్మించి ఉప్పుసాక, జిన్నిగట్టు, ఒడ్డుగూడెం తదితర ఎస్టీ గ్రామాల ప్రజలకు సురక్షిత రవాణా సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కురుస తిరపతయ్య, బోల్లి శ్రీను, రవికుమార్, ఎడమ వెంకటేశ్వర్లు, సోడే లక్ష్మి, కురుస ఎర్రమ్మ తదితరులు పాల్గొన్నారు.








