E-PAPER

ప్రతీ తలనొప్పికి బ్రెయిన్ స్కాన్ అవసరమా? 90 శాతం కేసుల్లో నిజం ఇదీ!

సాధారణంగా తలనొప్పి రాగానే చాలా మంది కంగారుపడి బ్రెయిన్ ట్యూమర్ లేదా మరేదైనా పెద్ద సమస్య ఉందేమోనని సొంతంగానో, లేదా భయంతోనో ఎంఆర్ఐ (MRI) స్కాన్ చేయించుకోవాలని అనుకుంటారు. కానీ, వైద్యుల ప్రకారం దాదాపు 90 శాతానికి పైగా తలనొప్పులు మైగ్రేన్, టెన్షన్ లేదా సైనస్ వంటి సాధారణ కారణాల వల్లే వస్తాయి. వీటికి స్కాన్‌లు అవసరం లేదు. అయితే, తలనొప్పితో పాటు కొన్ని రకాల ‘డేంజర్ సిగ్నల్స్’ (ప్రమాదకర సంకేతాలు) కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది.

వైద్యులు హెచ్చరిస్తున్న దాని ప్రకారం.. గతంలో ఎన్నడూ లేని విధంగా అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి రావడం (దీనిని థండర్‌క్లాప్ హెడేక్ అంటారు), తలనొప్పితో పాటు వాంతులు అవ్వడం, చూపు మసకబారడం, లేదా మాట పడిపోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే అలర్ట్ అవ్వాలి. అలాగే తలనొప్పితో పాటు విపరీతమైన జ్వరం రావడం, మెడ బిగుసుకుపోవడం, లేదా ఫిట్స్ (మూర్ఛ) రావడం వంటివి జరిగితే అది మెదడులో ఇన్‌ఫెక్షన్ లేదా రక్తస్రావానికి సంకేతం కావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో అస్సలు ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి స్కాన్ చేయించుకోవాలి.

వయసు 50 ఏళ్లు పైబడిన వారిలో కొత్తగా తలనొప్పి ప్రారంభమైనా, లేదా క్యాన్సర్ రోగుల్లో అకస్మాత్తుగా తలనొప్పి మొదలైనా లైట్ తీసుకోకూడదు. అదేవిధంగా పడుకున్నప్పుడు లేదా ఉదయం లేవగానే తలనొప్పి తీవ్రంగా ఉండి, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు అది మరింత ఎక్కువైతే మెదడులో ఒత్తిడి పెరుగుతోందని అర్థం. ఇలాంటి ప్రత్యేక లక్షణాలు లేనప్పుడు సాధారణ తలనొప్పులకు మందులు, జీవనశైలి మార్పులతోనే నయం చేసుకోవచ్చని, అనవసరపు స్కాన్‌ల వల్ల ఆర్థిక శ్రమ తప్ప ఉపయోగం ఉండదని నిపుణులు సూచిస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News