అశ్వాపురం ;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో మాల జన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పినపాక నియోజకవర్గ అధ్యక్షులు చెట్టి సురేష్ మాట్లాడారు.
ఇందిరమ్మ ఇండ్ల రెండవ విడత లబ్ధిదారుల ఎంపికలో అధికారులు పారదర్శకత పాటించాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామ సభల ద్వారా అర్హులను గుర్తించి, పూర్తి విచారణ అనంతరం మాత్రమే తుది జాబితాను ప్రకటించాలని ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు.
అయితే కొందరు వ్యక్తులు ముందుగానే తమ పేర్లు జాబితాలో వచ్చాయని ప్రచారం చేస్తున్నారని, దీనిపై అధికారులే విచారణ జరపాలని కోరారు. అనర్హుల పేర్లు జాబితాలో చేర్చడం వల్ల నిజమైన నిరుపేదలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కూడా జరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవకతవకలు జరిగినట్లయితే జిల్లా హౌసింగ్ అధికారికి, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో మాల జన సమితి మండల అధ్యక్షులు చెట్టి మనోజ్, జూపల్లి ధ్రువ కుమార్, బత్తుల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.








