అధికార యంత్రాంగం మౌనం… ప్రజల్లో ఆందోళన
మణుగూరు:పులిపాటి పాపారావు | జర్నలిస్ట్
ఇరవై ఏళ్లుగా ఎన్నికలు లేకుండా కొనసాగుతున్న మణుగూరు పట్టణంపై ప్రజల్లో అసహనం రోజురోజుకీ పెరుగుతోంది. మున్సిపాలిటీగా కొనసాగుతున్నప్పటికీ ప్రజా ప్రతినిధులు లేకపోవడం వల్ల అనేక అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, సమస్యలు పేరుకుపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఎన్నికల ద్వారా ఏర్పడాల్సిన మున్సిపల్ కౌన్సిల్ స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నా, ప్రజలకు జవాబుదారీ లేకుండా పరిపాలన సాగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.అభివృద్ధి పనులపై ప్రభావం
ఎన్నికలు జరగకపోవడంతో మణుగూరులో ప్రాథమిక వసతుల అభివృద్ధి కూడా తీవ్రంగా ప్రభావితమైందని స్థానికులు చెబుతున్నారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు వంటి అంశాలపై సమస్యలు ఉన్నా వాటిని ప్రశ్నించే ప్రజా ప్రతినిధి లేకపోవడం ప్రధాన లోపమని వారు పేర్కొంటున్నారు.“ప్రతి సమస్యకు అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఎన్నికైన వార్డు సభ్యుడు ఉంటే సమస్యలు నేరుగా చెప్పుకునే అవకాశం ఉండేది” అని పలువురు నివాసితులు తెలిపారు.
నిధులు వస్తున్నా… వినియోగంపై అనుమానాలు..!?
మణుగూరు మున్సిపాలిటీ పరిధికి నిధులు వస్తున్నప్పటికీ, అవి ఎక్కడ ఖర్చవుతున్నాయన్న అంశంపై ప్రజల్లో స్పష్టత లేదని తెలుస్తోంది. మున్సిపల్ కౌన్సిల్ లేకపోవడంతో నిధుల వినియోగంపై ప్రజల పర్యవేక్షణ లేకుండా పోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ పరిస్థితి అవినీతికి దారితీసే ప్రమాదం ఉందని, ప్రజాస్వామ్య నియంత్రణ లేకుండా పరిపాలన కొనసాగడం సరికాదని స్థానిక మేధావులు అభిప్రాయపడుతున్నారు.
అధికారుల మాట ఏమిటి?
ఈ విషయమై అధికారులను సంప్రదించగా, మణుగూరు మున్సిపాలిటీపై ఉన్న కోర్టు కేసులే ఎన్నికలు జరగకపోవడానికి ప్రధాన కారణమని వారు చెబుతున్నారు. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
అయితే, కేసులు ఉన్నాయనే కారణంతో ఇంతకాలం ప్రజలను ఎన్నికల నుంచి దూరం పెట్టడం సమంజసం కాదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ప్రజాస్వామ్య హక్కులపై ప్రశ్నలు
న్యాయపరమైన చిక్కులు ఒకవైపు ఉన్నప్పటికీ, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు, స్థానిక స్వయంపాలన హక్కులు మణుగూరు ప్రజలకు అందడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే సవాల్‌గా మారుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.“ఎన్నికలు లేకుండా పాలన కొనసాగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం” అని స్థానిక సామాజిక కార్యకర్తలు వ్యాఖ్యానించారు.
ప్రజా ఉద్యమానికి సంకేతాలు?
ఎన్నికల అంశంపై ప్రభుత్వ స్పందన లేకపోతే ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతామని మణుగూరు ప్రజలు హెచ్చరిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని కలెక్టరేట్, ఎన్నికల సంఘానికి వినతిపత్రాలు ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.మణుగూరు మున్సిపాలిటీ భవితవ్యంపై ప్రభుత్వం ఎప్పుడు స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉందని స్థానికులు అంటున్నారు.








