మెదక్ ఫిబ్రవరి 4
మెదక్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి వార్డు కాంటెస్ట్ అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత టీఆర్‌ఎస్ ప్రభుత్వం మెదక్ మున్సిపాలిటీకి చేసిందేమీ లేదని విమర్శించారు. నిధులు, నియామకాల విషయంలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, మహిళలకు ఉచిత బస్సు, గృహలక్ష్మి వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిందని తెలిపారు. గత ప్రభుత్వం లక్షల కోట్లు వెనకేసుకున్నదే తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. మెదక్ మున్సిపాలిటీలో అన్ని వార్డు సభ్యులు కలిసికట్టుగా పనిచేసి బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. అభ్యర్థులు ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడితేనే ఫలితాలు అనుకూలంగా వస్తాయని అన్నారు. మెదక్ ప్రజలు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారని మంత్రి ప్రశంసించారు.అనంతరం మెదక్ పట్టణంలోని కాంగ్రెస్ అభ్యర్థులకు దిశానిర్దేశం చేయడంతో పాటు 30వ వార్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే పట్టణంలోని 14వ వార్డులో పర్యటించారు.








